ఇంటర్నెట్‌డెస్క్, హైదరాబాద్: తెలుగుభాషను ప్రాచీన భాష నుంచి, ప్రపంచ భాషగా ముందుతరాలకు అందించే సంకల్పంతో ముందుకు సాగుతున్న సిలికానాంధ్ర ‘మనబడి’ మరో విజయం సాధించింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాండియాగో నగరంలో ‘పోవే’ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్‌లో ‘మనబడి’ పాఠ్య ప్రణాళికా ప్రమాణాలకు వరల్డ్ లాంగ్వేజ్ గుర్తింపు లభించింది. దీని ద్వారా మనబడిలో తెలుగు నేర్చుకునే విద్యార్థులకు విదేశీ భాష విషయంలో అర్హత లభిస్తుంది. మనబడి కొత్త విద్యా సంవత్సరం 2016-17 తరగతులు సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్నాయని పిల్లలకు తెలుగుభాష నేర్పించాలనుకునే వారందరూ వెంటనేmanabadi.siliconandhra.org ద్వారా మనబడిలో అడ్మిషన్ పొందవచ్చని డీన్ రాజు చమర్తి తెలిపారు. పోవే స్కూల్ డిస్ట్రిక్ట్‌లో వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్ అర్హత సాధన ప్రక్రియలో మనబడి ఎక్రిడిటేషన్ విభాగం ఉపాధ్యక్షులు శ్రీదేవి గంటి నాయకత్వంలో శాన్‌డియాగో మనబడి సమన్వయకర్తలు జవహర్ కంభంపాటి, హేమచంద్ర తలగడదీవి, బేబి లింగంపల్లి, ప్రవీణ్ శనిగేపల్లి, మహేశ్ కోయ, ఎంతో కృషి చేశారని ఆర్థిక విభాగం ఉపాధ్యక్షులు దీనబాబు కొంబుభట్ల అభినందనలు తెలిపారు. ఈ సంద్భంగా మన బడి గ్లోబల్ డెవలప్‌మెంట్ ఉపాధ్యక్షులు శరత్ వేల మాట్లాడుతూ.. భాషా దినోత్సవం సందర్భంగా సిలికానాంధ్ర మన బడి ఆధ్వర్యంలో అమెరికా వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ‘తెలుగుకు పరుగు’ కార్యక్రమంలో పాల్గొని తెలుగు భాషపై తమ అభిమానాన్ని చాటిన మనబడి భాషా సైనికులందరికీ, సహకరంచిన వివిధ తెలుగు సంస్థలన్నిటికీ ధన్యవాదాలు తెలిపారు.