Call for DevChamps to join our team- Yagna Jyothy Vemuri

సరదాగా ఆడుకుంటూ, ఆట పాటలతో అల్లరి చేస్తూ రోజంతా ఆంగ్లంలో మాట్లాడే పిల్లలు మనల్ని అమ్మ, నాన్న అనే ఒక్క పిలుపు తెలుగులో పిలిచేటప్పుడు మనకు కలిగే ఆనందం అనిర్వచనీయం. అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలతో “నేను బాగున్నాను, నువ్వు ఎలాగున్నావు?” అనే ఒక వాక్యం తెలుగులో మాట్లాడితే వారికి కలిగే సంతోషం వెలకట్టలేనిది. మరి ప్రపంచం నలుమూలలా ఉండే ఆ మన పిల్లలు రోజంతా మన తెలుగు భాషలో ఆలోచిస్తూ, మాట్లాడుతూ, ఆడుతూ పాడుతూ ఉండగా వారి కుటుంబాలలో కనిపించే ఆనందాలు, వారి కుటుంబ సభ్యుల మనసులలో కలిగే సంతోషాలే ఈ తరం పెద్దలు తరువాత తరాలకు ఇచ్చే అసలైన ఆస్తిపాస్తులు, సిసలైన బహుమానం.

ప్రపంచం నలుమూలలా ఉన్న మన తెలుగు పిల్లలకు పదహారణాల మన తెలుగు భాషను తరతరాలకు అందించే దీక్షను పద్దెనిమిది సంవత్సరాలుగా అక్షరాల లక్ష మంది పైగా విద్యార్థులకు తెలుగు పాఠాలు, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు నిర్విఘ్నంగా బోధిస్తున్నది మన సిలికానాంధ్ర మనబడి.

భాషాసేవయే భావితరాల సేవ- ఈ నినాదమే ప్రేరణగా భావితరాలో తెలుగు వెలుగులు మరింత దేదీప్యమానంగా నలుదిక్కులా నాలుగు కాలాల పాటు ప్రసర్పింపజేసే బాధ్యతను, శ్రమగా కాకుండా అదృష్టంలా భావించి, ఇష్టంతో, నవ్వుకుంటూ అందరితో కలిసిమెలిసి పనిచేయాలి అనే ఉద్దేశ్యంతో తలకెత్తుకున్న కీలక బృందం శ్రీ ప్రసాద్ జోస్యుల గారి నేతృత్వంలోని ఈ మన మనబడి అభివృద్ధి జట్టు.

లక్ష్యం:

మనబడి కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, మన తెలుగు భాషను, సంస్కృతినీ మనబడి ద్వారా మన తెలుగు పిల్లలందరికీ నేర్పించడం.

ఈ లక్ష్య సాధనలో భాగంగా అభివృద్ధి జట్టుని రెండు కీలక వర్గాలుగా విభజించబడింది. మొదటిది- మనబడి కార్య నిర్వహణ, రెండవది- మనబడి కుటుంబ విస్తరణ.

మనబడి కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించి భావితరాలకి బంగారు బాట వేయడానికి పూనుకున్నారు- కార్యనిర్వహణ జట్టు అధ్యక్షురాలు శ్రీమతి తూములూరి స్మిత. శ్రీ నాగెళ్ళ మహేష్ గారు మరియు శ్రీమతి వేమూరి యజ్ఞజ్యోతి గారు కార్యనిర్వహణ జట్టులో ఉపాధ్యక్షులుగా ఉంటూ తమవంతు సహాయ సహకారాలందిస్తున్నారు. క్రొత్త బాధ్యతలు తీసుకుని మనబడి ప్రాంతీయ సమన్వయకర్తలు, కేంద్ర సమన్వయకర్తలతో కలసి మెలసి అభివృద్ధి బాధ్యతలను నిర్వహించడానికి, గురువులు, సమన్వయకర్తల సమస్యేదైనా సరే- మేమున్నామనీ మీ ఫలితాలు, మీ గెలుపు ఖాయమని చేయూతనివ్వడమే మా ఈ కార్యనిర్వహణ జట్టు లక్ష్యం.

మన తెలుగు భాషను, సంస్కృతినీ మనబడి ద్వారా మరెంతో మంది తెలుగు పిల్లలకి దగ్గరచేయడానికి నడుము బిగిస్తున్నారు మనబడి విస్తరణ జట్టు అధ్యక్షులు శ్రీ పరిమి శివ గారు, వారితో పాటే శ్రీ పప్పు శ్రీకాంత్ గారు. యూటా రాష్ట్రం అయినా, వాషింగ్టనైనా, చైనా దేశమైన అయినా, చిలే అయినా, ఆఫ్రికా ఖండం అయినా, ఆస్ట్రేలియా అయినా, తెలుగు వారు ఉన్న ప్రతీ ఖండం, దేశం, రాష్ట్రం, నగరం- స్థలమేదైనా సరే- మనబడి ఉందనీ, మీ పిల్లల నోట తెలుగు మాట, మీ పిల్లల మనసులో తెలుగు సంస్కృతి ఖాయమనీ భరోసా ఇచ్చి మనబడి, మన తెలుగు భాష జెండా పాతడమే మా ఈ విస్తరణ జట్టు లక్ష్యం.

మనబడి అభివృద్ధి జట్టు తరఫున మనబడి కుటుంబాలకిదే మా ఆహ్వానం. రండి, మనబడి అభివృద్ధి జట్టులో చేరి మాతో చేతులు కలపండి, కార్యనిర్వహణ, విస్తరణ అనే రెండు కళ్ళతో మన-అభివృద్ధిని, మన భాష భావితరాల్లోకి వేసే వడివడి అడుగులని మీ కళ్ళారా చూడండి!

మన ఈ అభివృద్ధి జట్టులో చేరడానికి కావల్సిన లక్షణాలు తెలుగు భాష పట్ల ప్రేమ గౌరవం, నలుగురితో సరదాగ మాట్లాడి, కలిసి పనిచేయడానికి ఇష్టం, మన చుట్టూ ఉండే తెలుగు పిల్లలకు తెలుగు నేర్చుకునే అవకాశాలు కల్పించాలనే తపన, ఆకాంక్ష, కాస్త చిత్తశుద్ధి, సృజనాత్మకత, బాగా నవ్వుకోగలగడానికి ఓపిక.

మీ అందరికీ ఇదే మా హార్దిక స్వాగతం

To join, please contact us here by email devchamps@manabadi.siliconandhra.org