10 వేలకు పైగా విద్యార్థులతో ప్రారంభమైన సిలికానాంధ్ర మనబడి తరగతులు 2018

  • Home
  • 10 వేలకు పైగా విద్యార్థులతో ప్రారంభమైన సిలికానాంధ్ర మనబడి తరగతులు 2018

Eenadu Coverage : ప్రారంభమైన సిలికానాంధ్ర మనబడి తరగతులు
10 వేలకు పైగా విద్యార్థుల నమోదు
 

చికాగో (అమెరికా): ప్రపంచ వ్యాప్తంగా 12 దేశాలు, ముఖ్యంగా అమెరికాలోని 35 రాష్ట్రాలలోని 260కి పైగా కేంద్రాల్లో ప్రవాసాంధ్రుల పిల్లలకు తెలుగు భాషను నేర్పిస్తున్న సిలికానాంధ్ర మనబడి కొత్త విద్యా సంవత్సరానికి గాను సెప్టెంబర్ 8న తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ విద్యా సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో 10 వేల మందికి పైగా విద్యార్థులు నమోదు చేసుకున్నారు. అంతేకాకుండా మనబడి నూతన విద్యా సంవత్సరం తెలుగు భాషాభిమాని, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమక్షంలో చికాగోలో ప్రారంభం కావడం మరొక విశేషం. సిలికానాంధ్ర మనబడి ద్వారా పిల్లలకు తెలుగు నేర్పించడం గొప్ప కార్యక్రమమని, అందులోనూ మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం చాలా ఆనందాన్ని కలిగించిందని వెంకయ్య నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపుతో పాటు, ప్రతిష్టాత్మక (WASC)వాస్క్ ఎక్రిడియేషన్, పలు స్కూల్ డిస్ట్రిక్ట్‌లలో ఫారిన్ లాంగ్వేజ్ గుర్తింపు లభించిన ఏకైక తెలుగు విద్యాలయం సిలికానాంధ్ర మనబడి అని మనబడి డీన్ (అధ్యక్షుడు) రాజు చమర్తి పేర్కొన్నారు. పదకొండేళ్లుగా మనబడి ద్వారా 45 వేల మందికి పైగా చిన్నారులకు తెలుగు నేర్పించామని ఆయన తెలిపారు.

అమెరికా వ్యాప్తంగా 260కి పైగా ప్రాంతాలలో ప్రారంభమైన మనబడిలో తెలుగు మాట్లాడటం, బాలానందం, తెలుగుకు పరుగు, పద్యనాటకం, తెలుగు పద్యం, నాటకోత్సవాలు, పిల్లల పండుగలు వంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు మన కళలు, సంప్రదాయాల పట్ల అవగాహన కలిగిస్తున్నామని మనబడి అభివృద్ధి ఉపాధ్యక్షుడు శరత్ వేట తెలిపారు. సిలికానాంధ్ర మనబడి 2018-19 విద్యాసంవత్సరంలో ప్రవేశం కావాలనుకున్న వారు 1-844-626-2234 కు కాల్ చేయవచ్చని మనబడి ఉపాద్యక్షుడు దీనబాబు కొండుభట్ల కోరారు. మనబడి విజయాలకు కారణమైన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, భాషా సైనికులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. లాస్ ఏంజిలస్‌లో డాంజి తోటపల్లి, న్యూజెర్సీలో శరత్ వేట, డాలస్‌లో భాస్కర్ రాయవరం, సిలికాన్ వ్యాలీలో దిలీప్ కొండిపర్తి, శాంతి కూచిభొట్ల, శ్రీదేవి గంటి, శిరీష చమర్తి, శ్రీవల్లి కొండుభట్ల, స్నేహ వేదుల, రత్నమాల వంక, లక్ష్మి యనమండ్ల, జయంతి కోట్ని, శ్రీరాం కోట్ని , చికాగోలో సుజాత అప్పలనేని, వెంకట్ గంగవరపు, వర్జీనియా నుంచి శ్రీనివాస్ చివలూరి, మాధురి దాసరి, గౌడ్ రామాపురం, ఉత్తర కెరోలిన నుంచి అమర్ సొలస, అట్లాంటా నుంచి విజయ్ రావిళ్ళ తదితరులు, మనబడి ఉపాధ్యాయులు, సమన్వయకర్తల సహకారంతో నూతన విద్యా సంవత్సర తరగతులు వైభవంగా ప్రారంభమయ్యాయి.