విజయవంతంగా మొదలైన మన బడి – Eenadu

  • Home
  • విజయవంతంగా మొదలైన మన బడి – Eenadu

విజయవంతంగా మొదలైన మన బడి
ఇంటర్నెట్‌డెస్క్‌: భాషా సేవయే భావి తరాల సేవ! అనే స్ఫూర్తితో ప్రవాస తెలుగు బాలలకు తెలుగు భాష నేర్పించే సిలికానాంధ్ర మన బడి 2016-17 విద్యా సంవత్సరం తరగతులు సెప్టెంబర్‌ 10 న అమెరికా వ్యాప్తంగా 35 రాష్ట్రాలలో, 12 దేశాలలో 275 కి పైగా ప్రాంతాలలో ప్రారంభమయినాయి. దాదాపు 6500 మంది విద్యార్థులు ఈ తరగతులకు నమోదు చేసుకున్నారు.
సిలికాన్‌ వ్యాలీలోని ఫ్రెమంట్‌ హైస్కూల్‌లో మనబడి తెలుగు తరగతులను ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ, సిలికానాంధ్ర మన బడిని చూసాక తెలుగు భాష భవిష్యత్తు మీద భరోసా మరింత పెరిగిందన్నారు. మాతృదేశానికి దూరంగా ఉన్నా పిల్లలకు తెలుగు నేర్పాలన్న తపన ఉన్న తల్లిదండ్రులకు, వారికి తెలుగు నేర్పుతున్న మన బడి బృందానికి అభినందనలు తెలిపారు. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆనంద్‌ కూచిబోట్ల మాట్లాడుతూ, తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తిని చాటాలన్న ఏకైక లక్ష్యంతో సిలికానాంధ్ర పని చేస్తోందని, ఆ కార్యచరణలో భాగంగానే 10 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించమని రాజు చమర్తి నేతృత్వంలో ఎన్నో విజయాలను సాధిస్తున్నామని తెలిపారు. డీన్‌ రాజు మాట్లాడుతూ, తెలుగు విశ్వ విద్యాలయం గుర్తింపుతో పాటు, వాస్క్‌ ఎక్రిడిటేషన్‌, ఇతర డిస్ట్రిక్‌లలో ఫారిన్‌ లాంగ్వేజ్‌ గుర్తింపు లాంటి అనేక విజయాలు సొంతం చేసుకున్న ఏకైక తెలుగు విద్యా విధానం సిలికానాంధ్ర మన బడి అని ఇక్కడ తెలుగు నేర్చుకున్న పిల్లలు వారి వారి రంగాలలో ఎంతో ఉన్నత స్థాయిల్లో ఉన్నారని, గత పది సంవత్సరాలలో మన బడి ద్వారా 25000 మందికి పైగా పిల్లలకు తెలుగు నేర్పించామని,తెలుగును ప్రాచీన భాష నుండి ప్రపంచ భాషగా అందించే భాషా సారధులు మన బడి విద్యార్థులే అని పేర్కొన్నారు. అమెరికా వ్యాప్తంగా 275 కి పైగా ప్రాంతాలలో ప్రారంభమైన సిలికానాంధ్ర మన బడిలో ప్రవేశం కావాలనుకునేవారు వెంటనే మనబడి. సిలికానాంధ్ర. ఆర్గ్‌ ద్వారా ఈ నెల 23వ తేదీ లోగా నమోదు చేసుకోవాలని ఉపాధ్యక్షులు దీనబాబు కొండుభట్ల చెప్పారు. మన బడి విజయాలకు కారణమైన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు, భాషా సైనికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
లాస్‌ ఏంజెల్స్‌లో డాంజి తోటపల్లి, న్యూజెర్సీలో శరత్‌ వేట, డాలస్‌లో భాస్కర్‌ రాయవరం, సిలికాన్‌ వ్యాలీలో దిలీప్‌ కొండిపర్తి, సంజీవ్‌ తనుగుల శాంతి కూచిబోట్ల, అనిల్‌ అన్నం, శ్రీదేవి గంటి, శిరీష చమర్తి, లక్ష్మి యనమండ్ల, జయంతికోట్ని, శ్రీరాం కోట్ని, ఫణి మాధవ్‌ కస్తూరి తదితరుల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల మన బడి ఉపాధ్యాయులు, సమన్వయ కర్తల సహకారంతో మనబడి నూతన విద్యా సంవత్సర తరగతులు ప్రారంభమయ్యాయి.