ఇంటర్నెట్‌డెస్క్, హైదరాబాద్: కెనడాలోని టొరంటోలోని శ్రీ సత్యసాయిబాబా సెంటర్ టొరంటో యార్క్‌లో సిలికానాంధ్ర మనబడి పిల్లల పండుగను ఘనంగా నిర్వహించారు. మంజునాధ సిద్ధాంతి వేదమంత్రాల నడుమ శ్రీమతి గీతాలక్ష్మి, మీనా మూల్చూరి, ఉదయ సాయిరాం, శ్రీమతి అనురాధ, రమాదేవి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కెనడా మనబడి సమన్వయకర్త గంగాధర్ సుఖవాసి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కొండుభట్ల దీనబాబు, ఆచార్య కులశేఖరరావు, శ్రీచారి సామంతపూడి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా అమెరికా నుంచి విచ్చేసిన సిలికానాంధ్ర మనబడి ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షకులు కొండుభట్ల దీనబాబు మాట్లాడుతూ… వేలకొద్ది భాషా సైనికులు, వందలకొద్ది ఉపాధ్యాయుల సమష్టి కృషియే మనబడి విజయానికి కారణమని వ్యాఖ్యానించారు. తెలుగు భాషను ప్రాచీన భాష నుంచి ప్రపంచ భాషగా గుర్తించేందుకు ఓ బృహత్తర కార్యక్రమంమనబడి అని అన్నారు. అనంతరం మనబడి చిన్నారులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.